పోచంపల్లి - భారత దేశపు పట్టు పట్టణం
తెలంగాణ లోని నల్గొండ జిల్లా లోని పోచంపల్లి పట్టణం, అక్కడ నేయబడే అత్యంత నాణ్యమైన పట్టు చీరల వల్ల, భారత దేశపు పట్టు పట్టణంగా పేరు పొందింది. కేవలం చీరల వల్లే పోచంపల్లి ప్రసిద్ధి కాదు. సంస్కృతి, సంప్రదాయం, వారసత్వ సంపద, చరిత్ర, ఆధునికతల మేలు మిశ్రమం కావటం దీని ప్రత్యేకత. ఈ సుందర పట్టణం కొండలు, తాటి చెట్ల వరసలు, సరస్సులు, చెరువులుచే ఆవృతమై ఉంది. ప్రజల నిత్య కృత్యాలతో పట్టణం ఎప్పుడూ సందడిగా ఉంటుంది. అయితే, వారి పని, అతిథులను మనస్ఫూర్తిగా ఆహ్వానించటంలో అడ్డుపడదు. నిజానికి, చాలా మంది విదేశీ పర్యాటకులు పట్టు చీరల నేత నేర్చుకోవటానికి వారాలు తరబడి పోచంపల్లి లోనే బస చేయటం సాధారణం.
ఈ పట్టణానికి చాలా ఆసక్తికరమైన చరిత్ర ఉంది. స్వాతంత్ర్యానంతర భారత దేశంలోని ఒక ముఖ్యమైన ఉద్యమానికి పోచంపల్లి లో జరిగిన సంఘటన వెన్నెముకగా నిలిచింది. 1951 వ సంవత్సరంలో ఇక్కడికి విచ్చేసిన వినోభా భావేకి పోచంపల్లి ప్రజలు ఘన స్వాగతం పలికారు. ప్రజలు తమకోసం, తమ కుటుంబాల కోసం 80 ఎకరాల భూమిని కోరారు. పోచంపల్లి లో ఒక భూస్వామి అయిన వెద్రే రామచంద్ర రెడ్డి 250 ఎకరాల భూమిని ప్రజలకు స్వచ్చంద వితరణగా అందించారు. ఈ ఘటన భూదాన ఉద్యమ స్ఫూర్తిని బాగా రగిలించింది. అప్పటినుంచి ఈ పట్టణం భూదాన్ పోచంపల్లిగా పిలవబడుతుంది.
పోచంపల్లిలో చూడవలసిన ఆసక్తికరమైన ప్రదేశాలలో వినోభా మందిరం, 101 ద్వారాల గృహం ముఖ్యమైనవి. విమానాశ్రయం గానీ, రైల్వే స్టేషన్ గానీ ఇక్కడ లేకపోయినా, హైదరాబాద్ నుంచి ఈ పట్టణం చేరుకోవటం తేలికే. రాష్ట్రం లోని మిగతా ప్రదేశాల లాగే పోచంపల్లి లో ఉష్ణ మండల వాతావరణం ఉంటుంది. వేసవులు మిక్కిలి వేడిగా, శీతకాలాలు చల్లగా ఉంటాయి. ఆసక్తికరమైన చరిత్రతో, విశిష్టమైన సంస్కృతితో, కొనుగోలుకి అవకాశాలతో పోచంపల్లి అనబడే ఈ చిన్న పట్టణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న యాత్రికులను ఆకర్షిస్తుంది.
Comments
Post a Comment